మధుమేహుల్ని వేధించే ఇబ్బందుల చిట్టా చేంతాడంత పెద్దది. ఆ వరసలో నడుము నొప్పీ ఉంటుందని చాలామందికి తెలియదు. వీరిలో ఇది.. ప్రత్యేకించి కూర్చున్నప్పుడు తగ్గుతూ, నడిచేటప్పుడు విజృంభిస్తుంటుంది. నడవటం
మొదలుపెట్టగానే.. నొప్పి తీవ్రత పెరుగుతుంది. నడక ఆపితే, ఒక్కసారిగా తగ్గి, క్రమేపీ మాయమవుతుంది. అదే దీని ప్రత్యేకత.మధుమేహులు ఈ తరహా నడుము నొప్పి విషయంలో పొరపాటు పడుతూ, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా నొప్పి వంటివాటిని అనుమానిస్తారు. చాలా రోజులపాటు అలాగే తోసేసుకు తిరిగి, ఎట్టకేలకు ఎముకల వైద్యుల్ని సంప్రదిస్తారు. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ తదితర పరీక్షలన్నింటినీ వరసపెట్టి చేయించి, చివరికి క్యాల్షియం, నొప్పి నివారిణి మాత్రలు, వ్యాయామ సూచనలతో ఇంటిముఖం పడతారు. వీటన్నింటినీ పాటించినా సరైన ఉపశమనం కనిపించదు. ప్రతి నెలా డాక్టర్ల చుట్టూ తిరగటం, మందుల్ని మార్చటం, నొప్పితో బాధపడటం.. ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది.
నడుము నొప్పా? యాంజైనా?మధుమేహం లేని సాధారణ ఆరోగ్యవంతుల్లో నడుము నొప్పి వేధించటానికి మామూలుగా రెండు కారణాలు తోడవుతాయి. ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్ తాలూకు పాతనొప్పి తిరగదోడటం ఒకటైతే, అధిక బరువు, నడక తగ్గిపోవటం వంటివి రెండో కారణం. ఏ మాత్రం వ్యాయామం, వాకింగ్ చేయకుండా, గంటల తరబడి కూర్చోవటానికి అలవాటు పడితే.. నడుములో వెన్నుపూసలకు అనుసంధానంగా ఉండే కండరాలు, లిగమెంట్లు సాగే గుణాన్ని కోల్పోతాయి. బిగుతుగా, బిరుసుగా మారతాయి. ఫలితంగా.. ఇలాంటి వారు వాకింగ్, శారీరక శ్రమ చేసినప్పుడు నడుము నొప్పి వేధిస్తుంది.
మరోవైపు.. మధుమేహ బాధితులకు నడుము, తొడల్లో నొప్పిగా ఉందంటే ఇతరత్రా కారణాల్ని అనుమానించాల్సిందే. వీరిలో సమస్యకు కారణం లిగమెంట్లు సాగే గుణాన్ని కోల్పోవటం మాత్రం కాదు. నడుము, తొడల ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గిపోవటం కూడా మధుమేహ బాధితుల్లో ఇలాంటి సమస్యలకు కారణమవుతుంది. ఇలా రక్తప్రసరణ చాలీచాలకుండా జరగటాన్ని వైద్య పరిభాషలో 'యాంజైనా' అంటారు. గుండె గోడలకు రక్త ప్రసరణ సక్రమంగా అందకపోతే 'ఛెస్ట్ యాంజైనా' తలెత్తినట్లే.. నడుము కండరాలకు చాలీచాలని రక్తప్రసరణ జరుగుతున్నప్పుడు 'వెయిస్ట్ యాంజైనా', 'నడుము నొప్పి' రూపంలో సమస్య బయటపడుతుంది. ఛెస్ట్ యాంజైనాను నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు తలెత్తినట్లే, నడుము యాంజైనాకు సకాలంలో సరైన చికిత్స అందించకపోతే పాదాలకు రక్తసరఫరా తగ్గి గ్యాంగ్రీన్ సమస్య తలెత్తవచ్చు.
నొప్పెందుకు?గుండె నుంచి కిందికి వచ్చే పెద్ద రక్తనాళం పొట్ట దాకా వెళ్లి అక్కడ కాలేయం, పేగులు వంటి అవయవాలకు శుద్ధమైన ఆక్సిజన్‌ను అందజేస్తుంది. ఇదే నాళం నడుము భాగంలోని కండరాలు, అవయవాలకు కూడా ఆక్సిజన్ అందజేస్తుంది. ఆ తర్వాత అది రెండుగా విడిపోయి ఎడమ, కుడి తొడలవైపు ఒక్కో నాళం వెళ్లి, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఈ నాళాల ద్వారా రక్తం పాదాల వరకూ చేరుతుంది.
సాధారణంగా రక్తనాళాల గోడలకు కొవ్వు, కొలెస్ట్రాల్, క్యాల్షియం వంటివి పేరుకు పోతూంటే, రక్తనాళాలలో రక్తప్రసరణ మార్గం కుచించుకుపోతుందన్న సంగతి తెలిసిందే. దీనివల్ల అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. మధుమేహ బాధితుల్లో వ్యాయామం, క్రమశిక్షణ కొరవడితే రక్తంలో గ్లూకోజ్ పెరిగి పోతుంది. కొవ్వు, క్యాల్షియం పేరుకుపోవటంతో రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడతాయి. మధుమేహుల్లో.. ఈ రక్తనాళం రెండుగా విడిపడే నడుము భాగంలో అవరోధం ఏర్పడవచ్చు. దాంతో తొడలు, పాదాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా నడుము నొప్పి వేధిస్తుంది. ఈ పరిస్థితిని 'లెరిచ్ సిండ్రోమ్'గా వ్యవహరిస్తారు.
నిర్లక్ష్యానికి మూల్యమెక్కువనడుము యాంజైనాకు సరైన చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే.. పురుషాంగానికి రక్తప్రసరణ మందగించి, సామర్థ్య సమస్యలు తలెత్తవచ్చు. రెండో సమస్య- పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోవటం. దీనివల్ల పాదాల్లో తీవ్రమైన నొప్పితోపాటు కండ నల్లబారటం, గ్యాంగ్రీన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. సెక్సు సామర్థ్యాన్ని పదిల పరచుకోవటానికీ, పాదాల్ని పరిరక్షించుకోవటానికి మధుమేహులు నడుము యాంజైనా విషయంలో నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిందే.
పెయిన్ కిల్లర్లు వద్దునడుము నొప్పితో బాధపడేవారు.. తరచూ డాక్టర్లను మార్చేస్తుంటారు. దీనితో వారు వాడే నొప్పినివారిణ మాత్రల (పెయిన్ కిల్లర్లు) బ్రాండ్లు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కొంతమంది డాక్టర్ని సంప్రదించటానికి బదులుగా, తమకు తామే నేరుగా మందుల దుకాణానికి వెళ్లి పలురకాల మాత్రల్ని తెచ్చుకుని వాడేస్తుంటారు. ఏ కొంచెం నొప్పిగా, నలతగా ఉన్నా వెంటనే మాత్ర వేసేసుకుంటారు. ఇలా పెయిన్ కిల్లర్లను ఏళ్ల తరబడి విచ్చలవిడిగా వాడటం వల్ల రెండురకాలుగా నష్టం వాటిల్లుతుంది. ఎలాగంటే.. నొప్పి నివారిణి మాత్రలతో నొప్పినుంచి ఉపశమనం పొందుతూ, నడుము యాంజైనాకు సరైన వైద్య చికిత్స తీసుకోకపోవటం వల్ల పాదం కోల్పోయే ప్రమాదం తలెత్తుతుంది. రెండోవైపు- మూత్రపిండాల వైఫల్యం తెలెత్తే అవకాశం పెరుగుతుంది. పెయిన్ కిల్లర్లను ఎక్కువెక్కువగా వాడటమే ఇలాంటి సమస్యకు కారణం. ప్రత్యేకించి మధుమేహుల్లో పెయిన్ కిల్లర్లు కిడ్నీ వైఫల్యానికి దారితీస్తాయి. కొంతలోకొంత ప్యారసెటమాల్ వంటివే కిడ్నీలకు సురక్షితమైన మాత్రలుగా తేలాయి.
నడుము నొప్పి.. ఏం చేయాలి?నడుము నొప్పి సమస్య వేధిస్తుంటే.. పెయిన్ కిల్లర్లు వేసేసుకుని నొప్పి నుంచి ఉపశమనం పొందటం శాశ్వతమైన పరిష్కారం కాదన్న సంగతి గుర్తించాలి. మీరు మధుమేహులై, నడుము నొప్పితో కూడా బాధ పడుతున్నట్లయితే వెంటనే నడుము దగ్గర రక్తనాళాల పూడికలను కూడా అనుమానించటం మంచిది. తొడలు, పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల పరిస్థితి ఎలా ఉంది?రక్త సరఫరా సజావుగానే జరుగుతోందా అనేది నిర్ధారించుకోవాలి.
నడుము నొప్పితో బాధపడే మధుమేహులకు... వ్యాస్కులర్, కార్డియో థొరాసిక్ సర్జన్లు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. డాప్లర్, సీటీ యాంజియోగ్రఫీ, ఎంఆర్ యాంజియోగ్రఫీ వంటి రోగనిర్ధారణ సౌకర్యాలతోపాటు, లింబ్ బైపాస్ సర్జరీ, స్పైనల్ సర్జరీ వంటి శస్త్రచికిత్సలు చేసే అవకాశాలుండే ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం.
పొగ వద్దేవద్దుమధుమేహులకూ, పొగకూ ఆమడ దూరం. పొగాకుగానీ, పొగనుగానీ చేరదీస్తే రెండుకాళ్లకీ ముప్పు కొనితెచ్చుకోవటం ఖాయమన్న సంగతి మరవద్దు. మధుమేహుల విషయంలో.. ధూమపానం అగ్నికి ఆజ్యం పోయటం లాంటిది. మధుమేహుల్లో కాళ్లు, పాదాలకు రక్తసరఫరా తగ్గుతుంది, దీనికి తోడు పొగాకు నమలటం, సిగరెట్ తాగటం వంటి అలవాట్లవల్ల సమస్య మరింత తీవ్రమై పాదాల్లో గ్యాంగ్రీన్ ఏర్పడి, కాళ్లు పోగొట్టుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఇవేకాదు.. పొగాకు వినియోగం వల్ల లింబ్ బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు చేసిన తర్వాత కోలుకోవటం కూడా కష్టతరమవుతుంది. ఇలాంటి చికిత్సల తర్వాత కూడా పొగతాగటం మాననట్లయితే.. కృత్రిమంగా అమర్చిన స్టెంట్ నాళాలు సైతం కుంచించుకుని సమస్యలకు దారితీస్తాయి. సిగరెట్లు తాగే సంఖ్యను నెమ్మదిగా తగ్గించటం వల్ల వైద్యపరంగా పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. మొత్తంగా మానేస్తేనే చికిత్స పనిచేస్తుంది.
చికిత్స సౌకర్యాలేమిటి?యాంజియోగ్రఫీ చేయటం ద్వారా.. కాళ్లూ, పాదాలకు రక్తసరఫరా చేసే రక్తనాళం ఎక్కడ, ఎంతమేర మూసుకుపోయిందనేది తెలుస్తుంది. దీంతో ఎలాంటి చికిత్స చేయాలనేది నిర్ణయించవచ్చు. మెజారిటీ కేసుల్లో ఆర్టీరియల్ బైపాస్ సర్జరీ అవసరమవుతుంటుంది. ఇందులో కృత్రిమ రక్తనాళాల్ని అమర్చుతారు. మరికొంతమందిలో స్టెంట్లు అమర్చటం ద్వారా మూసుకుపోయిన నాళాల్ని తెరుచుకునేలా చేస్తారు. అయితే.. ఇలాంటి చికిత్సల తర్వాత రోగి ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగవ్వాలంటే.. క్రమం తప్పకుండా నడవటం, వ్యాయామం తప్పనిసరి.
Add comment